చెత్తపై బల్దియా పీఛేముడ్..డస్ట్​బిన్ల తరహాలో స్వీపింగ్ వేస్ట్ కలెక్షన్ పాయింట్లు

  • డస్ట్​బిన్ల తరహాలో స్వీపింగ్ వేస్ట్ కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు 
  • నాలుగేండ్ల కింద గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు ఎత్తివేత
  •  బస్తీల్లోకి స్వచ్ఛ ఆటోలు రాకపోవడంతో జీవీపీల స్థానంలో చెత్త పారబోత
  • ఫైన్లు వేసినా, సెక్యూరిటీని పెట్టినా జనంలో రాని మార్పు
  • తప్పని పరిస్థితుల్లో మళ్లీ చెత్త సేకరణ పాయింట్లు ఏర్పాటు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో చెత్త సమస్య తీరకపోవడంతో జీహెచ్ఎంసీ మళ్లీ పాత పద్ధతినే ఫాలో అవుతోంది. డస్ట్ బిన్ లెస్ సిటీగా మార్చేందుకు నాలుగేండ్ల కింద సిటీలోని గార్బేజ్​వల్నరబుల్​పాయింట్లను తొలగించిన బల్దియా తిరిగి డస్ట్​బిన్లు తరహాలో ‘స్వీపింగ్ వేస్ట్ కలెక్షన్ పాయింట్లు’ ఏర్పాటు చేస్తోంది. జీవీపీలను ఎత్తివేశాక పరిస్థితిలో మార్పురాక పోగా చెత్త సమస్య తీవ్రమవడంతో జీహెచ్ఎంసీ బ్యాక్​స్టెప్​ వేసింది.

డస్ట్ బిన్లను తొలగించాక ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైనే చెత్త వేస్తుండడంతో పారిశుద్ధ్య కార్మికులను జీవీపీల ఏరియాల్లో కాపలా పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. గత నెలలో దాదాపు 100 మందిని గుర్తించి ఫైన్లు వేసినా ఫలితం లేదు. దీంతో చేసేదేమీ లేక చివరకు మళ్లీ డస్ట్ బిన్ల తరహాలో స్వీపింగ్ వేస్ట్ కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పాయింట్ల వద్ద రేకులతో దుకాణం మాదిరిగా షెడ్డు ఏర్పాటు చేసి అందులో చెత్త వేస్తే బయటకు కనిపించకుండా ఉండేలా ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి గార్బేజ్ వెహికల్స్ లో చెత్తను ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు తరలిస్తారు.  

ముందుగా బస్తీల్లో..  

గ్రేటర్ లోని చాలా బస్తీల్లో చెత్తను తీసుకువచ్చి రోడ్లపై పారేస్తున్నారు. బస్తీల్లోని కొంతమందికి అవగాహన లేకపోవడం ఒక కారణమైతే, వారి ఇండ్ల నుంచి చెత్తని తీసుకువెళ్లేందుకు స్వచ్ఛ ఆటోలు రాకపోవడం మరో కారణం. బల్దియా ముందుగా ఇలాంటి బస్తీలపైనే దృష్టి పెట్టింది. ఎక్కువ చెత్త సమస్య ఉన్న బస్తీల్లో స్వీపింగ్ వేస్ట్ కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి డివిజన్ కు ఒక పాయింట్ చొప్పున.. గ్రేటర్ లోని 150 డివిజన్లలో ఒక్కొక్క పాయింట్​ఏర్పాటు చేయనున్నారు. వీటితో చెత్త సమస్యకు చెక్ పడితే అవసరమైన ప్రాంతాల్లో మరికొన్ని ఏర్పాటు చేయనున్నారు.  


గార్బేజ్ ఫ్రీ సిటీ సాధ్యం కాలే

గార్బేజ్ ఫ్రీ సిటీ పేరుతో బల్దియా నాలుగేండ్ల కింద గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల(జీవీపీ)ను ఎత్తివేయగా ఇందులో సగం వరకు ఎత్తేయగా అక్కడే సమస్య ఎక్కువైంది. గ్రేటర్ లో 2,541 జీవీపీలను ఎలిమినేట్ చేశామని, సగం జీవీపీలు కూడా లేవని బల్దియా సగర్వంగా ప్రకటించింది. అయితే, చాలా ఏరియాల్లోని ఇండ్లకు స్వచ్ఛ ఆటోలు వెళ్లడం లేదు. 4,500 ఆటోలున్నప్పటికీ రిపేర్లతో పాటు ఇతర కారణాలతో వెయ్యి వరకు ఆటోలు ఫీల్డ్ లోకే వెళ్లడం లేదు. దీంతో ఆటోలు రాని బస్తీల్లో జనాలు చెత్త ఎక్కడ వేయాలన్న దానిపై స్పష్టతనివ్వలేదు. ఆయా ప్రాంతాల్లోని జనం రాత్రి వేళల్లో రోడ్లపై చెత్త తెచ్చి పోస్తున్నారు. చెత్త సమస్యలపై ఫిర్యాదులు పెరిగిపోవడంతో జీహెచ్ఎంసీ స్వీపింగ్ వేస్ట్ కలెక్షన్ పాయింట్లను ఏర్పాటు చేస్తోంది.